పెద్దపల్లి, ఆగస్టు 04
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో, కొత్త పాలకవర్గం ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మిటుకు రామ్మూర్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఎమ్మెల్యే తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలపరిమితి ఈ నెలలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి భర్తీపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
ఇటీవల మంథని మండలంలోని గుంజపాడు గ్రామానికి చెందిన మిటుకు రామ్మూర్తికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని అప్పగించనున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్మూర్తి కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందినది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నాడు.
దివంగత నేత, మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు, ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా రామ్మూర్తికి మంచి గుర్తింపు ఉంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైన రామ్మూర్తి, మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అండగా నిలుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆ వర్గానికి తగిన నామినేటెడ్ పదవులు దక్కలేదని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి పీఏసీఎస్ చైర్మన్ పదవిని మిటుకు రామ్మూర్తికి కేటాయిస్తే దళిత సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. చైర్మన్ పదవికి రామ్మూర్తి సరైన వారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు.
అయితే, మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై మరికొంతమంది నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారు కూడా ఎలాగైనా ఈ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీంతో మంథని పట్టణ, నియోజకవర్గం, మండలాల్లోని ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










