జఫర్ గడ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
జఫర్ గడ్ మండల కేంద్రంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
జఫర్ గడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బిఆర్ఎస్ పార్టీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని, అత్యంత నీచ స్థాయికి దిగజారి విష ప్రచారాలు చేస్తుందని, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి అబద్ధపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
బిఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు
బిఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని తనపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీహరి ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్లో సంజీవ రెడ్డి అనే వ్యక్తికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు జరిగిన గొడవను కడియం శ్రీహరిపైనే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, ఇంత దుర్మార్గంగా అబద్ధపు వార్తలు చేయడం బిఆర్ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి, నెల జీతాలు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, నాయకులపై సంబంధం లేని, సబ్జెక్ట్ లేని వార్తలతో విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన పద్ధతి కాదని సూచించారు.
నిజాయితీగా పనిచేస్తా
తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దగ్గర రూపాయి అవినీతికి పాల్పడలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా నిజాయితీగా పనిచేసే వారినే ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
సన్న బియ్యం పంపిణీపై వివరణ
దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, తెలంగాణ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13,800 కోట్ల ఖర్చుతో, కోటి 6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 3 కోట్ల 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని అన్నారు.
బీజేపీ తీరుపై విమర్శలు
ఈ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ వాళ్లు అంటున్నారని, కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో చేపట్టే కార్యక్రమానికి మోడీ ఫోటో ఎలా పెడతారని ప్రశ్నించారు. పేద ప్రజల కడుపు నింపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు.












