** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
ప్రస్తుత పాలకులు, నాయకులు దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని, వారిని కదిలించడం గగనమై పోతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దారుణంగా వ్యవహరించడం అమానవీయమని వ్యాఖ్యాత తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పరీక్ష పేపర్ల లీకేజీలపై బాధ్యత వహించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
కొన్ని తిట్లకు అర్హులైన మనుషులు, రాజ్యాలు ఎప్పటికీ ఉంటాయని, వారికోసమే ఆ పదాలు సజీవంగా ఉన్నాయని వ్యాఖ్యాత పేర్కొన్నారు. రాచరిక, భూస్వామిక సమాజాలలో పుట్టిన తిట్లు ఇప్పటికీ కొనసాగడం అంటే మనం ఇంకా ఆనాటి కాలంలోనే ఉండిపోయామని అర్థం చేసుకోవాలని సూచించారు. సిగ్గు, ఎగ్గు లేకపోవడం, దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరించడం, నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, మొద్దు చర్మం, తలబిరుసు వంటి పదాలను నేటి నాయకులు, పాలకులు, పాలనపై ఉపయోగించవచ్చని, ఈ పదాలు పుట్టిన నాటికన్నా ఇప్పుడు మరింత కచ్చితంగా అమరుతున్నాయని అన్నారు. మనుషులు, పాలకులు దిగజారి పోతున్నారని, వారిని కదిలించడం గగనమై పోతోందని, నియంతృత్వము, నిరంకుశత్వం అనే మాటలు కూడా సరిపోనంతగా కర్కశులై పోతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న నాయకులు, ప్రభుత్వాలు ఇంత దారుణంగా వ్యవహరించడం అమానవీయమని పేర్కొన్నారు.
ప్రజలు ప్రభుత్వాన్ని దిగిపొమ్మని అడుగుతున్నారా? తాము అధికారంలోకి వస్తామని అంటున్నారా? రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలపడమని, దాని ప్రకారమే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, మంత్రులు బాధ్యతగా, జవాబుదారీగా ఉండాలని కోరుతున్నారని వ్యాఖ్యాత తెలిపారు. గత ఏడేండ్లలో యాభైకి పైగా పరీక్ష పేపర్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతుంటే, తమ భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడితే, ఈ సామాన్య తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పెరుగుతున్న ఒత్తిడిని చూసి దుఃఖపడుతుంటే, ఈ అవకతవకలకు బాధ్యత వహించాలని కోరటం నేరమా అని ప్రశ్నించారు. మనిషన్నవాడు ఎవడైనా స్పందిస్తాడని, మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు దిగిరాడని, అంత మొద్దు చర్మమా అని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, ఇంజనీరు, సామాజిక ఉద్యమకారుడు, రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు కూర్చున్నారని, ఇరవై రోజులు గడిచినా అతని ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నదని తెలిపారు. ఆయన రాజకీయాలకు అతీతమైన వారని, లద్దాఖ్ ప్రజల కోసం పనిచేసిన వారని, చలిలో గడ్డకట్టుకుపోయే సైనికుల కోసం వేడి టెంట్‌ను కనిపెట్టిన వారని, ప్రజల నీటి సమస్యను పరిష్కరించటానికి మంచు స్థూపాలను నిర్మించిన శాస్త్రవేత్త అని, చైనా వస్తువుల వ్యతిరేకించి నందుకు, బీజేపీ నాయకుల ప్రశంసలను అందుకున్నవాడు కూడా అతనేనని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు ఆయనతో చర్చలు జరపడం లేదని, తమ తప్పిదాలను ప్రశ్నిస్తున్నాడనే కదా, అంటే మీకు వంత పాడితే పొగుడుతారని, ప్రశ్నిస్తే చనిపోవాలని చూస్తారని, ఇంతకన్నా అనాగరికం ఏముందని వ్యాఖ్యాత విమర్శించారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆనాడు భారతీయులపై దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తూ, నిరంకుశంగా పాలన సాగిస్తున్నప్పుడు, గాంధీ నాయకత్వాన నిరాహార దీక్షలతో నిరసన తెలిపారని, అంతటి సామ్రాజ్య వాదులు, నియంతలు కూడా వచ్చి చర్చలు జరిపారని, మీరు కోరుతున్నది ఏమిటని కనీసంగా అడిగారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం, మన చేతులతో ఎన్నుకున్న నాయకుడు ఏమీ పట్టనట్లు ఉండటం, నిర్లక్ష్యంగా చూడటం ఎంతటి రాక్షసత్వం అని వ్యాఖ్యానించారు. కనీసం చర్చ చేయాలని, సమస్యను పరిష్కరించకపోగా, వాంగుచుక్ చైనా ఏజెంట్ అని, దేశద్రోహి అని, విద్యార్థులను దేశద్రోహులని, దొంగ నిరాహారదీక్షలని నాయకులు మాట్లాడటం అమానుషమని అన్నారు. అడిగినవాళ్లు దేశద్రోహులా? లీకులు చేసి, అవినీతికి పాల్పడిన వారు దేశభక్తులా? ఇదేమి రాజ్యం అని ప్రశ్నించారు. ధర్మబద్ధ నిరసన తెలుపుతున్న వాంగ్చుక్ను నిన్న ఉదయం ఆయన అనుమతి లేకుండానే వందలాది పోలీసులొచ్చి, విద్యార్థులపై దాడిచేసి, సోనమ్‌ను తరలించడం నియంతృత్వ చర్య అని పేర్కొన్నారు. ఇది కూడా అతని ఆరోగ్యం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలివ్వటం వల్ల జరిగిన పరిణామమని, అసలైతే అతని ఆరోగ్యం, ప్రాణాలపై ఏమాత్రం ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అన్నారు. దేశ ప్రధాని విదేశాలు తిరుగుతూ పురస్కారాలు అందుకుంటూ అంకెల ఉపన్యాసాలతో హాస్యం పండిస్తున్నారని, అమెరికా బెదిరించినా మౌనంగా ఉన్నారని, రెండు కోట్ల ఉద్యోగాలేవి అంటే మౌనంగా ఉన్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని జనం గగ్గోలు పెడితే మౌనంగానే ఉన్నారని, రూపాయి విలువ పడిపోతున్నా మౌనంగానే ఉన్నారని, మణిపూర్ మంటలు చెలరేగుతుంటే మౌనంగానే, విద్యావ్యవస్థ ధ్వంసం అవుతున్నా మౌనంగానే ఉంటున్నారని, ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయన్నా కరగని కఠినశిలలా ఉండిపోయారని విమర్శించారు. రేపు పార్లమెంటుకు మార్చ్ చేసి కుంభకర్ణుల్ని కదిలించాలని, వీళ్లు కపట కుంభకర్ణులని, ప్రతి గొంతూ నినదిస్తేనే కదిలించగలమని వ్యాఖ్యాత పేర్కొన్నారు.












