సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రులుగా ఎదిగిన వారి జాబితాలో తమిళ నటుడు దళపతి విజయ్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, జానకి రామచంద్రన్, మరియు ఎన్టీ రామారావు వంటి ప్రముఖులు సినిమా రంగం నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. ఈ కోవలో విజయ్ ఏడో వ్యక్తిగా నిలిచే అవకాశం ఉంది.
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత తర్వాత, రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న అనేక మంది నటులు ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో విజయం సాధించినవారు అరుదు. అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, శివాజీ గణేశన్, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా, జయ బధురి, హేమమాలిని, వైజయంతిమాల, శత్రుఘ్న సిన్హా వంటి బాలీవుడ్ నటులతో పాటు, తెలుగులో కృష్ణ, జమున, దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, రామానాయుడు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, జయప్రద, శారద, జయసుధ, రోజా వంటి అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ప్రవేశించారు. వీరు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం వంటి పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కూడా పనిచేశారు.
కొంతమంది నటులు సొంతంగా పార్టీలు స్థాపించి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వలె చరిత్ర సృష్టించాలని ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అనంతరం కాంగ్రెస్లో విలీనం చేసి, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర నటులు సొంత పార్టీలు పెట్టినా, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. విజయ్ కాంత్, శరత్ కుమార్ వంటి వారు కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
చో రామస్వామి, కొంగర జగ్గయ్య వంటి వారు కూడా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత తర్వాత, రాజకీయాల్లో హీరోలుగా తమ ప్రభావాన్ని చాటడంలో ఇతర సినీ ప్రముఖులు అంతగా విజయవంతం కాలేకపోయారు. ఇప్పుడు దళపతి విజయ్, పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ పరిస్థితిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కొంతవరకు సినీ ప్రముఖులపై ఉన్న 'వెళ్లిపోతారు' అనే ముద్రను చెరిపివేస్తే, తమిళనాడులో విజయ్ సినీ నటుల కోసం రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే అవకాశం ఉంది. తెలుగునాట ఎన్టీ రామారావు తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించి, కాంగ్రెస్ను మట్టికరిపించి, ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రక రికార్డు. ఆయన తొలి ప్రయత్నంలోనే అనూహ్య విజయం సాధించారు. విజయ్ కూడా తొలి ప్రయత్నంలో విజయం సాధించినా, పొత్తుల అవసరం లేకుండా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ రికార్డు ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.












