పదేళ్లు మంత్రిగా ఉన్నా నిర్మల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఇంద్రకరణ్ రెడ్డి పదవులు, డబ్బుల కోసం పార్టీలు మారిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి బీజేపీని విమర్శించే అర్హత లేదని అన్నారు. రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తూ, కేవలం మీడియాలో కనిపించడం కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది నిధులు తీసుకువస్తున్నారని, ఆయన రాష్ట్ర స్థాయిలో పోరాడుతున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి రైతుల పక్షాన ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు, ఇంద్రకరణ్ రెడ్డి మతిభ్రమించి మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు.
ఇంద్రకరణ్ రెడ్డి అధికారంలొ ఉన్నప్పుడు దందాలు, అరాచకాలు చేశారని, అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారారని బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు. అధికారంలో లేకపోయినా నిర్మల్ కు కేంద్రం నుంచి వందల కోట్ల నిధులు తెప్పిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలో విఫలమైందని, సీఎంను అడిగే దమ్ములేక బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు.
రెండున్నర సంవత్సరాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ - హైదరాబాద్ రైల్ పనులను వేగవంతం చేయించారని, ఇది ఇంద్రకరణ్ రెడ్డి పదేళ్లలో చేయలేని పని అని పేర్కొన్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.












