సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద హై స్కూల్ లో శనివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ బోనాల వేషధారణలో పాల్గొన్నారు. ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల పండుగ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆషాడ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని, ఈ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతలు సమర్పించే నైవేద్యమే బోనాలని, మహిళలు కొత్త కుండలో అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పించడం ఈ పండగ ప్రత్యేకత అని వివరించారు.
ఈ పండుగ భక్తి, సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని, పవిత్రతను పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సముద్రాల గీత, ప్రిన్సిపల్ నేరెళ్ల ఉషారాణి, వైస్ ప్రిన్సిపల్ మర్రి కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











