హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, మేధో శిఖరం, ఆర్థికవేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమానికి కేవలం ఆవేశం సరిపోదని, ఆలోచనను ఆయుధంగా మార్చుకోవాలని చాటిన జయశంకర్, గణాంకాలను గండ్రగొడ్డళ్లుగా మార్చి దోపిడీ గుండెల్లో నిద్రపోయిన సైద్ధాంతిక సింహం అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, మేధో శిఖరం, ఆర్థికవేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, సంస్థలు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమానికి కేవలం ఆవేశం సరిపోదని, ఆలోచనను ఆయుధంగా మార్చుకోవాలని చాటిన జయశంకర్, గణాంకాలను గండ్రగొడ్డళ్లుగా మార్చి దోపిడీ గుండెల్లో నిద్రపోయిన సైద్ధాంతిక సింహం అని కొనియాడారు. స్వరాష్ట్ర సాధనే శ్వాసగా మలిచి, తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎగరేసిన యోధుడు ఆయన అని స్మరించుకున్నారు.
ఆర్థికవేత్తగా, ఉద్యమకారుడిగా
జయశంకర్ తన యావత్ జీవితాన్ని ఉద్యమానికి అర్పించిన బ్రహ్మచారి. పోరాటానికి భావోద్వేగమే కాదు, బలమైన ఆధారాలు కావాలని చాటిన మేధావి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే సూత్రాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో నాటిన గురువు ఆయన. జయశంకర్ సంధించిన ప్రశ్నలతో పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన సత్యనిరూపణ, నిధుల వినియోగంపై డొల్లతనాన్ని ఎత్తిచాటిన మేధావి. దోపిడీని గణాంకాలతో సహా ప్రపంచానికి చూపిన జ్ఞాన దీపం ఆయన.
తెలంగాణ గొంతుకగా
తెలంగాణ తల్లి గొంతుకై దేశదేశాలు తిరిగిన జయశంకర్, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటాడు. భాషను, బతుకును, వివక్షను ఎలుగెత్తి చాటాడు. కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడుతూ ఉద్యమ నాయకత్వానికి దిశానిర్దేశం చేశాడు. ఆయన కోట్లాది గుండెల్లో రగిల్చిన స్వరాష్ట్ర కాంక్ష తెలంగాణ విముక్తికి రాచబాట అయింది.
భావజాల సాయుధ పోరాటం
జయశంకర్ నడిపిన భావజాల సాయుధ పోరాటం కోట్లాది గుండెల్లో రగిలింది. స్వరాష్ట్ర కాంక్ష బలమైన సైద్ధాంతిక పునాదిపైనే నేడు సాకారమైంది. మన బంగారు తెలంగాణ సిద్ధాంతమే ఊపిరిగా పోరాడిన ఆర్థికవేత్త, తెలంగాణ జాగృతికి నిత్య చైతన్య దీప్తి ఆయన. ఆయన ఆశయాల సాధనకు ఉద్యమించడమే నిజమైన నివాళి అని పలువురు అభిప్రాయపడ్డారు.
నివాళులర్పించిన వారు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం, తెలంగాణ వికాస వేదిక, తెలంగాణ కుమ్మర సంఘం (880/2014) రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రస్తుత ప్రభుత్వ విధానం కావాలని, అవినీతి రహిత తెలంగాణను నిర్మిద్దామని, ప్రజాస్వామ్య తెలంగాణ సాకారానికి సన్నద్ధమవుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.











