** (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 18
ప్రపంచ స్థాయికి తెలంగాణ విద్యార్థులను తీసుకుపోవడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యారంగంపై ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. అయితే, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ఉన్న సిఫార్సులను అమలు చేయడం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం వంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ స్థాయికి తెలంగాణ విద్యార్థులను తీసుకుపోవడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, పిల్లల కోసం మీరు పనిచేయండి.. మీకు నేనున్నా, నా సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇప్పటి నుంచి ఐదేండ్లు దీక్ష పూనండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యారంగంపై ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఫిన్లాండ్, జర్మనీ విద్యావిధానాలను అధ్యయనం చేసి వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రికి పాఠశాల విద్యారంగంపై మంచి లక్ష్యం ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం.
ఈ ఏడాది చివరి నాటికి నివేదిక సిద్ధం చేయడం, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించడం, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడం వంటి హడావుడి నిర్ణయాల కంటే ఇప్పటికే ఉన్న సిఫార్సులను అమలు చేయడం ముఖ్యం. అన్ని స్థాయిల్లో పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాల్లో సమగ్ర సంస్కరణల ద్వారా ప్రీప్రైమరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యా నాణ్యతను పెంచాలని ఆకునూరి మురళీ ఛైర్మన్‌గా పనిచేసిన విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. అలాంటప్పుడు మరో కొత్త నివేదిక ఎందున్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యారంగానికి బడ్జెట్లో దాదాపు తొమ్మిది శాతం కేటాయించామని, తెలంగాణలో 27.50 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. గత మూడేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో లక్షకు పైగా చేరడం సానుకూల పరిణామమే. దేశంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ రెండేళ్లలో 18వ స్థానానికి చేరిందని ఉపాధ్యాయుల పనితీరును కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అంకెలు, గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పాఠశాల విద్య ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త పథకాలు తీసుకురావడం, ఉన్న పథకాల పేర్లు మార్చడం, కొన్ని పథకాలను అటకెక్కించడం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకం ద్వారా 26 వేల పాఠశాలల్లో మూడు దశల్లో 12 రకాల పనులు చేపట్టాలని సంకల్పించింది. కానీ సుమారు 1,200 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 2 వేల పాఠశాలల్లో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఆ పథకం కూడా నీరుగారింది. కేజీ టు పీజీ పథకం పరిస్థితి కూడా అంతే. విద్యారంగంపై పాలకులకు దీర్ఘకాలిక చిత్తశుద్ధి లేకపోవడం వల్ల స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు విస్తృతంగా అనుమతులు ఇస్తూ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి.










