మిర్యాలగూడ, జూలై 4
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధనకు అహర్నిశలు శ్రమించాలని కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆడవత్ సైదులు నాయక్ సూచించారు. త్రిపురారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో క్రీడా సామగ్రిని బాలికలకు అందజేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు తమ విద్యార్థి దశలోనే తాము అనుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని, దానిని సాధించుకునేందుకు కష్టపడి ప్రయత్నించాలని కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆడవత్ సైదులు నాయక్ అన్నారు.
శనివారం త్రిపురారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ధానావత్ రవి నాయక్ అందజేసిన క్రీడా సామగ్రిని బాలికలకు అందించి ఆయన మాట్లాడారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదని, దానికోసం రాత్రింబవళ్లు కష్టపడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. లక్ష్య సాధనలో అనేక ఒడిదొడుకులు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకునేలా ప్రయత్నం ఉండాలని సూచించారు.
లక్ష్యాన్ని సాధించుకునేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయ సహకారాలు తీసుకోవాలని కోరారు. లక్ష్య సాధనలో వెనుకడుగు వేస్తే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్నది సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాలని సూచించారు.
బాలికల విద్యకు ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రవి నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ నాయక్, మాజీ ఎంపీపీ దన్సింగ్ నాయక్, రవి నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, సైదా నాయక్, సైదులు నాయక్, బాలాజీ, రఘు, కొండ భాస్కర్, అనంతరెడ్డి పాల్గొన్నారు.











