గుంటూరు, 2026-08-20
రాష్ట్ర విద్యావ్యవస్థ క్రమంగా తీసికట్టుగా మారుతోందని, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగం వైపు మొగ్గు పెరుగుతోందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొ.కె. వియ్యన్నరావు విశ్లేషించారు. రాజ్యాంగ సవరణల నేపథ్యంలో కేంద్రం విద్యపై నియంత్రణ పెంచుకుంటూ పోతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై వ్యయం తగ్గిస్తూ ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విద్యావ్యవస్థ క్రమంగా తీసికట్టుగా మారుతోందని, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగం వైపు మొగ్గు పెరుగుతోందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొ.కె. వియ్యన్నరావు విశ్లేషించారు. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య, 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా ఉమ్మడి జాబితాలోకి చేరడంతో కేంద్రం విద్యపై విశేష అధికారాలను సంపాదించిందని ఆయన పేర్కొన్నారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినా, రాష్ట్రాలు కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని భావించి దీనిని పెద్దగా వ్యతిరేకించలేదని, విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించాలనే ఆలోచన కూడా కొన్ని చోట్ల ఉందని తెలిపారు.
కేంద్ర నియంత్రణ పెరుగుదల
కేంద్రం ఇదే అదనుగా విద్యా సంస్థలు, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంపై పూర్తి నియంత్రణ సాధించే ప్రయత్నం చేస్తున్నదని ప్రొ. వియ్యన్నరావు అన్నారు. ఉన్నత విద్యా సంస్థల స్థాపన, కోర్సుల ప్రారంభం, పాఠ్య ప్రణాళిక నిర్ధారణ, ప్రమాణాల మదింపు వంటి విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థల అజమాయిషీలో కొనసాగుతున్నాయని, రాష్ట్రాలది కేవలం ప్రేక్షక పాత్రేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పిపిపి (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) పేరున ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కనపడుతోందని తెలిపారు.
పాఠశాల విద్యలో ప్రభుత్వ రంగం క్షీణత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్య పరిస్థితిని విశ్లేషిస్తే, 2014-15 విద్యా సంవత్సరంలో 58,950 పాఠశాలలు ఉండగా, వాటిలో 44,617 ప్రభుత్వ రంగంలో (సుమారు 75.7 శాతం) ఉండేవి. ఈ సంఖ్య 2025-26 నాటికి 60,843 కు చేరినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 44,222 (72.7 శాతం) కు తగ్గింది. ప్రభుత్వ-ప్రైవేటు యాజమాన్యంలో నడిచే పాఠశాలల నిష్పత్తి 70:30 గా ఉండగా, విద్యార్థుల సంఖ్యాపరంగా ఈ నిష్పత్తి 60:40 గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు, తరగతులు మితంగా ఉండేవి, ప్రవేశాల సంఖ్య, డ్రాపవుట్ల శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ రంగంలో నడిచే పాఠశాలల ప్రభావం ఎంతమేరకు ఉందో అవగతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేని కుటుంబాలు మినహా, ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, క్రమబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న పాఠశాలల ఏకీకృత విధానం ప్రభుత్వ విద్యాసంస్థలను మరింతగా దిగజార్చుతోందని విమర్శించారు.
విద్యపై ప్రభుత్వ వ్యయం తగ్గుదల
రాష్ట్ర ప్రభుత్వం విద్యపై చేస్తున్న వ్యయం రాను రాను గణనీయంగా పడిపోతోందని ప్రొ. వియ్యన్నరావు ఆందోళన వ్యక్తం చేశారు. 2015-16లో మొత్తం బడ్జెట్ లో విద్యకు 16.44 శాతం కేటాయించగా, అది 2020-21 నాటికి 11.21 శాతానికి పడిపోయిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2026-27లో కూడా విద్యకు కేటాయింపు 11.7 శాతమే ఉందని తెలిపారు. మొత్తం రూపాయలలో కేటాయింపులు సుమారుగా రూ.14,000 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.35,000 కోట్లకు పెరిగినా, మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలలో విద్య శాతం 2020-21 నాటి స్థితిలోనే ఉందని పేర్కొన్నారు. ఈ అరకొర కేటాయింపుల ప్రభావంతో పాఠశాల విద్యాభివృద్ధి సూచిక (ఎస్.ఇ.డి.ఐ-సెడి)లో ఆంధ్రప్రదేశ్ 2025-26 గణాంకాల ప్రకారం 15వ స్థానంలో ఉందని, చండీగఢ్ (0.826), కేరళ (0.798), తమిళనాడు (0.706), మహారాష్ట్ర (0.645) వంటి రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోందని, ఆంధ్రప్రదేశ్ సూచీ 0.593 గా ఉందని వివరించారు.












