దేశ మహిళా ప్రజల ఆశాజ్యోతి, విద్యా స్ఫూర్తి ప్రదాత అయిన సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
మంగళవారం నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు. జిల్లా కో-కన్వీనర్ కథరోజు అశోక్ చారి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం చేసిన కృషి అమోఘమని, ఆమె త్యాగాల ఫలితంగానే నేడు మహిళలు విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఆడపిల్లకు చదువు అత్యవసరమని ఆమె నొక్కి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.
సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని, మహిళా సాధికారతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆమె చూపిన మార్గంలో నడవాలని యువతకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో-కన్వీనర్ కొత్తూరు కిషన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


