నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రేరణ అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
శనివారం మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో, మోటివేషనల్ స్పీకర్ మునీందర్ రాజు విద్యార్థులకు లక్ష్యసాధన, సమయ నిర్వహణ, పరీక్షా సిద్ధత, మానసిక ధైర్యం వంటి అంశాలపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. 'పట్టుదల, ప్రణాళిక, ప్రతిరోజు పునశ్చరణే విజయానికి మార్గం' అని ఆయన విద్యార్థులకు సూచించారు.
సబ్జెక్ట్ నిపుణులు ఉషాకిరణ్, శంకర్, రవిరాజు, మజీద్, మహేశ్వర్, వెంకట్రావు, సునీత, సంతోషీ మాత వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, బిట్ పేపర్ విధానం, రివిజన్ టెక్నిక్స్, ఎక్కువ మార్కులు సాధించేందుకు అవసరమైన సూచనలను వివరించారు.
ఈ సదస్సులో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా సలహాలు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


