వరంగల్, 2026-08-25
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి సారంపల్లి మల్లారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఆయన సర్పంచ్‌గా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి సారంపల్లి మల్లారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. సీపీఐ(ఎం) పార్టీలో సారంపల్లి మల్లారెడ్డి కుటుంబం ఒక భాగమని, ఆయన సర్పంచ్‌గా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. నదీజలాల సమగ్ర పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై ఆయనకున్న అపార జ్ఞానం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
మార్క్సిస్టు ఉద్యమ బలోపేతానికి కృషి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన సారంపల్లి మల్లారెడ్డి, మార్క్సిస్టు ఉద్యమ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. నర్సంపేట డివిజన్ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని సారంపల్లి మల్లారెడ్డి, పుచ్చకాయల చంద్రారెడ్డి ఆప్తమిత్రులుగా కలిసి అకుంఠిత దీక్షతో నిర్మించారు. ఇటీవలె పుచ్చకాయల చంద్రారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. చంద్రారెడ్డి సంతాపసభ సందర్భంగా మల్లారెడ్డి నవతెలంగాణకు నాటి పోరాటాలు, పార్టీ బలోపేతంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు ఎదురొడ్డి సీపీఐ(ఎం)ను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. మార్క్సిస్టు ఉద్యమంలో సారంపల్లి మల్లారెడ్డి మహోపాధ్యాయులుగా, అతివాద పోకడలు, హత్యారాజకీయాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలిగా, సమసమాజం కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన స్ఫూర్తిదాతగా గుర్తింపు పొందారు.
బాల్యం, కుటుంబ నేపథ్యం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు ఆగస్టు 25, 1939లో మల్లారెడ్డి జన్మించారు. 1964 నుండి 1971 వరకు తిమ్మంపేట గ్రామ పోలీస్ పటేల్‌గా మల్లారెడ్డి పనిచేశారు. ఆగస్టు 6, 1971లో తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఎకె గోపాలన్ తిమ్మంపేట గ్రామాన్ని సందర్శించారు. 1953లో మల్లారెడ్డి కనకలక్ష్మీని వివాహమాడారు. 1954లో తండ్రి సారంపల్లి కృష్ణారెడ్డి, 1988లో తల్లి రాధమ్మ మరణించారు. 1957-58లో మల్లారెడ్డి పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. 1959 జులైలో వాసుదేవరెడ్డి, 1962 ఆగస్టులో మధుసూదన్‌రెడ్డి జన్మించారు. 1964 ఫిబ్రవరిలో కనకలక్ష్మీ మరణించడంతో 1966 మార్చిలో భాగ్యలక్ష్మీని వివాహమాడారు. సారంపల్లి మల్లారెడ్డి కుమారులిద్దరూ సీపీఐ (ఎం)లో కొనసాగుతున్నారు. సారంపల్లి వాసుదేవరెడ్డి సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శిగా గతంలో పని చేయగా, సారంపల్లి మధుసూదన్‌రెడ్డి న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
పుచ్చకాయల చంద్రారెడ్డితో స్నేహం, పార్టీ పునర్నిర్మాణం
ఉమ్మడి వరంగల్ జిల్లా మార్క్సిస్టు ఉద్యమంలో పుచ్చకాయల చంద్రారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి ఆప్తమిత్రులు. వారిద్దరూ నర్సంపేట డివిజన్లో పార్టీ మనుగడకు వీరోచితంగా పోరాడారు. నాటి కాంగ్రెస్ హత్య రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఓంకార్ వెంట పార్టీ కేడర్ అంతా వెళ్లిపోయినా, వారిద్దరూ పార్టీలోనే కొనసాగి తిరిగి పార్టీని బలోపేతం చేశారు. 1960లో సీపీఐ(ఎం)లో పీసీఆర్ చేరగా, 1973లో సారంపల్లి మల్లారెడ్డి పార్టీ సభ్యుడయ్యారు. నర్సంపేట తాలూకాలో, డివిజన్ స్థాయిలో పార్టీ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేశారు. నిర్బంధంలో సీపీఐ(ఎం)ను పునర్నిర్మించడంలో వీరిద్దరిదీ కీలకపాత్ర. 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి శ్రమదానంతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్ నేతల దాడుల నేపథ్యంలోనూ పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఓంకార్ హింసావాద పోకడలను ఎండగట్టి పార్టీని కాపాడుకోవడానికి కృషి చేశారు. ఓంకార్‌ను సీపీఐ(ఎం) సస్పెండ్ చేశాక పార్టీ కేడర్ యావత్తు ఓంకార్‌తో వెళ్లిపోయినా మొక్కవోని ధైర్యంతో సీపీఆర్, మల్లారెడ్డి పార్టీని పునర్నిర్మించారు. నర్సంపేట డివిజన్ పార్టీ కార్యదర్శిగా కూడా పీసీఆర్ పనిచేశారు. 1996 వరకు సారంపల్లి, పీసీఆర్ కలిసి పనిచేశారు. అనంతరం సారంపల్లి పార్టీ అవసరాల దృష్ట్యా హైద్రాబాద్‌కు వచ్చారు. నర్సంపేట నుంచి పీసీఆర్ వరంగల్‌కు వచ్చి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. 1985లో జనగామ ఎమ్మెల్యేగా సీపీఐ(ఎం) నాయకులు ఏసిరెడ్డి నర్సింహారెడ్డి ఎన్నికయ్యాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి పునర్వైభవం వచ్చింది. 1990లో నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపూర్ మండలాల్లో మళ్లీ పార్టీ శాఖలు నిర్మించారు.












