నిర్మల్, జూన్ 30
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల్లోని రైతు వేదికల నుంచి కలెక్టర్లు, రైతులు వీడియో సమావేశం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.36 వేల కోట్ల నిధులు జమ చేసినట్లు తెలిపారు.
రైతు రుణమాఫీ కోసం రూ.26,670 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైతు బీమా కింద రూ.3,500 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రతి నెల సగటున రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతాంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండే అవకాశముందని, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు దృష్టి పెట్టాలని, పంట మార్పిడి విధానాలను పాటించాలని సూచించారు.
నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామ రైతు వేదిక నుంచి జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ దేవదాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన అధికారి రమణ, తహసీల్దార్ ప్రభాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుప్రియ, రైతులు, అధికారులు పాల్గొన్నారు.












