రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేసిన నేపథ్యంలో, కుబీర్ మండలంలోని జాన్ గావ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
రైతుల వేదిక భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పున విడతల వారీగా నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
యాసంగి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని కాంగ్రెస్ నాయకులు రైతులకు సూచించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్, బంక బాబు, శివాజీ, సందీప్, గంగరాజు, విలాస్, మల్లన్న, బాబులాల్, షబ్బీర్, సాయినాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఈ నిధుల విడుదలకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.








