హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న 'ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్'లో పైలట్ కోర్సు అభ్యసిస్తున్న యువతిపై, అదే సంస్థకు చెందిన ఇన్స్ట్రక్టర్ నసిముద్దీన్ లైంగిక దాడికి పాల్పడి, బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నసిముద్దీన్ జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తానని చెప్పి, ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా, ఈ సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కేసులో నసిముద్దీన్తో పాటు, దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, ప్రధాన నిందితుడైన నసిముద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన శిక్షణా సంస్థలోనే ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.











