న్యూ ఢిల్లీ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడి వంటి అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్ బుధవారం అట్టుడికింది. ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణలోనూ ప్రతిపక్షాల నిరసనలు వెల్లువెత్తాయి.
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడి వంటి అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్ బుధవారం అట్టుడికింది. ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణలోనూ ప్రతిపక్షాల నిరసనలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రేరణా స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర ద్వార్ వరకు మార్చ్ నిర్వహించారు. దాక్కోవద్దు.. పార్లమెంటులో సమాధానం చెప్పండి అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు.
విద్యార్థులపై అమానుష ప్రవర్తన
విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించినందు వల్లే హోం మంత్రి ముఖం దాక్కుంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై పోలీసుల దురాగతాలపై హోం మంత్రి ప్రకటన చేయాలని, రామమందిర విరాళాల దుర్వినియోగంపై చర్చ జరపాలని, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదు
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వారు పార్లమెంటును అగౌరవపరుస్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా వారు సభలోకి అడుగు పెట్టడం లేదు. సభకు వచ్చి ప్రకటన ఇవ్వడంలో సమస్య ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా చెవిటివారా, మూగవారా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వాయిదాల పర్వం
ప్రతిపక్షాల ఆందోళనతో బుధవారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. రెండు సభల్లోనూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రామమందిర విరాళాల కుంభకోణంపై నిరసన తెలిపిన ప్రతిపక్ష పార్టీలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు విమర్శలు
కాంగ్రెస్, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీలు ఎల్లప్పుడూ శ్రీరాముడిని వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ ప్రాంగణంలో వారు ప్రదర్శించిన చందా చోరీ స్కిట్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అంతేకాకుండా, సభ సజావుగా పనిచేయడాన్ని ప్రతిపక్షం కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీ వేణుగోపాల్ మంచి మనిషే, కానీ ఆయన తన పార్టీ సభ్యులకు మర్యాద పాటించాలని అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు అని అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు.












