నిర్మల్ జిల్లా వడ్యాల్ గ్రామంలో చరిత్ర పరిశోధకులు అరుదైన ప్రాచీన శిలాశాసనాలను గుర్తించారు. ఒక దీపపు స్తంభంపై మధ్యయుగపు తెలుగు-కన్నడ లిపిలో దాన శాసనం, మరో రెండు లఘు శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావ్ వడ్యాల్ గ్రామంలోని ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో ఈ శాసనాలను కనుగొన్నారు. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న నాలుగు అడుగుల ఎత్తైన దీపపు స్తంభంపై చెక్కబడిన దాన శాసనం, అలాగే మరో రెండు లఘు శాసనాలు ఆయన పరిశీలించారు.
ఇసుకరాయిపై చెక్కబడిన ఈ దాన శాసనం కాలక్రమేణా కొంత అస్పష్టంగా మారినప్పటికీ, లిపి శైలి ఆధారంగా ఇది మధ్యయుగపు తెలుగు–కన్నడ లిపికి చెందినదని డాక్టర్ దేవరావ్ గుర్తించారు. శాసనం ప్రారంభంలో “స్వస్తి శ్రీ” అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇది ఒక దాన శాసనమని భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి పాఠం వెలుగులోకి రావడానికి మరింత పరిశోధన అవసరమని ఆయన పేర్కొన్నారు.
పూర్వకాలంలో రాత్రివేళ వెలుతురు కోసం ఏర్పాటు చేసే దీపపు స్తంభాలపై ఇలాంటి శాసనాలు ఉండే సంప్రదాయం ఉందని, ఈ శాసనం సుమారు 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలానికి చెందినదై ఉండవచ్చని అంచనా వేశారు. అదేవిధంగా, మరో రాయిపై దేవనాగరి లిపిని పోలిన అస్పష్ట శాసనం, మరొక లఘు శాసనం కూడా గుర్తించారు.
ఈ శాసనాలు కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి కాకతీయుల మధ్యయుగ కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు డాక్టర్ దేవరావ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 18 శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శాసనాలు జిల్లా చరిత్ర, సంస్కృతి, నాగరికత వైభవాన్ని తెలియజేస్తాయని ఆయన అన్నారు. ఈ క్షేత్ర పర్యటనలో అబ్బడి రాజేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.











