నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శనలు, వైద్య శిబిరం, మహిళల కోసం నిర్వహించిన క్రీడలను అప్పాల కావ్య సందర్శించారు. ఆమె పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్యులతో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, సెల్ఫీలు దిగారు.
కార్యక్రమం ప్రారంభంలో సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అప్పాల కావ్య మాట్లాడుతూ, మహిళలు ఇప్పటికే అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నారని, భవిష్యత్తులో ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. విద్య ద్వారా మాత్రమే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. వాసవి పాఠశాల విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు.
నిర్మల్ పట్టణంలో ఇప్పటికే ఉన్నతమైన విద్యా వాతావరణం ఉన్న పాఠశాలలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వినీశ, రిజొనెన్స్ ప్రిన్సిపాల్ లావణ్య, వాసవి పాఠశాల నిర్వాహకులు ముత్యం రెడ్డి, జగదీశ్ రెడ్డి, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


