నిర్మల్, జూలై 4
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్మల్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీల పూడిక పనులను ముమ్మరం చేశారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రియదర్శిని నగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా స్వచ్ఛమైన, హరితమైన సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జగతి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ కౌన్సిలర్లు కత్తి నరేందర్, లక్కాకుల హరీష్, నాయకులు అజార్, అడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంజులాపూర్ లో వర్షాకాలం ముందస్తు డ్రైనేజి నాల పూడిక పనులు ముమ్మరం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు, ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్, విజయనగర్ కాలనీ ప్రాంతాల్లో డ్రైనేజీలు, మురికి కాలువలు, నాలాలు పూడిక తీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షపు నీరు సాఫీగా ప్రవహించి, నీటి నిల్వలు ఏర్పడకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులను వేగవంతంగా చేపట్టారు.
ప్రజల సౌకర్యమే లక్ష్యంగా పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు మున్సిపల్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఇ. హరిభువన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












