బాసర నుండి భైంసా వరకు జాతీయ రహదారిని నాలుగు లైన్ల మార్గంగా విస్తరించాలని, అలాగే బాసర వంతెన వద్ద రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ లతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పవార్, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బాసర నుండి భైంసా వరకు ఉన్న రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి నాలుగు లైన్ల మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
గోదావరి నదిపై ఉన్న బాసర వంతెన వద్ద కూడా ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు.
బాసర నుండి మహూర్ వరకు జాతీయ రహదారి అనుసంధానంపై కేంద్ర మంత్రిని అడగగా, సంబంధిత ఫైల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉందని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఇతర రహదారుల అభివృద్ధికి కూడా నిధులు కోరినట్లు, అందుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.












