ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళకు జన్మించిన ఆడశిశువును, అది మృతి చెందిందని నమ్మించి విక్రయించిన ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆసుపత్రి నర్సు, మధ్యవర్తి, శిశువును కొనుగోలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా అనే మహిళ, ప్రసవం కోసం మెదక్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమెకు ఆడశిశువు జన్మించింది. అయితే, ఆసుపత్రి నర్సు అక్తరీ బేగం, పుట్టిన పాప మృతి చెందిందని తల్లిని నమ్మించింది.
డిశ్ఛార్జి అయిన తర్వాత, పాప బతికే ఉందని నస్రా ఫాతిమాకు తెలియడంతో ఆమె ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో, నర్సు అక్తరీ బేగం, మెదక్‌కు చెందిన నౌసిన్ ఉన్నిసా అనే మధ్యవర్తి ద్వారా, సిద్దిపేట దంపతులకు రూ.1.50 లక్షలకు ఆ శిశువును విక్రయించినట్లు గుర్తించారు.
పోలీసులు పాపను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, సఖి కేంద్రంలో అప్పగించారు. నర్సు, మధ్యవర్తి, శిశువును కొనుగోలు చేసిన దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రి యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆసుపత్రిని అధికారులు మూసివేశారు.








