మధిర, 27 July
మధిరలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది.
మధిరలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేసి, వారికి స్వయంగా వడ్డించడం తన రాజకీయ జీవితంలో మరపురాని అనుభూతిగా ఆయన అభివర్ణించారు.
హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించనున్నారు.
ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమని, విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఉచిత పోషకాహార అల్పాహార పథకం ఉచితం కాదని, భావితరాలపై ప్రజా ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడని ఆయన స్పష్టం చేశారు.
మానవ వనరులే రాష్ట్ర సంపదని, సానబెట్టిన వజ్రాల్లా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్ది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాలన అంటే పెత్తనం కాదని, సమాజ హితం కోసం వనరులను వినియోగించి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే నిజమైన పాలన అని అన్నారు.
‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవాలే నేడు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలుగా రూపుదిద్దుకుంటున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.












