కుంటాల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) అల్లాడి వనజ అధికారులను ఆదేశించారు. మండల కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎంపీడీవో వనజ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఉదయం వేళల్లోనే పనులు కేటాయించి, సమయపాలన పాటించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.
గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో, ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో 'బేటీ బచావో – బేటీ పడావో' కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ కమిటీలు బాలికల రక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, తద్వారా లింగ వివక్షను తగ్గించి, ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆమె పేర్కొన్నారు.










