హల్ద్వానీ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఎటువంటి పాత్ర లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఎటువంటి పాత్ర లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో శనివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
ఖర్గే ప్రశ్నలు
స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్, బీజేపీ సభ్యులు ఒక్కరైనా ఉన్నారా అని ఖర్గే ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా జైలుకు వెళ్లినా వారు తొలుత కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత అటువైపు వెళ్లిన వారై ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వామ్యం లేకపోయినా బీజేపీ నేతలు దేశభక్తిపై పాఠాలు, నీతులు చెబుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ప్రశంస
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారని ఖర్గే ప్రశంసించారు.
క్విట్ ఇండియా ఉద్యమం
1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆరోజు ఎంతో కీలకమైందన్నారు. డూ ఆర్ డై, క్విట్ ఇండియా నినాదాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారని గుర్తుచేశారు.
ఉత్తరాఖండ్ ప్రాముఖ్యత
ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పేర్కొన్న ఖర్గే, ఆ ప్రాంతానికి దేశ రక్షణలోనూ ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. కుమావోం, గర్వాల్ రెజిమెంట్లు దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందాయని చెప్పారు. దేశానికి తొలి పరమ్ వీర్ చక్ర అవార్డు అందుకున్న వీర సైనికుడు కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చారని ఖర్గే పేర్కొన్నారు.











