కీసర, 6 September
రాష్ట్ర ప్రభుత్వ అవగాహనారాహిత్యం, అధికారుల అనాలోచిత చర్యల కారణంగా పలుచోట్ల ప్రైవేట్ పట్టా భూములు సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేరుతున్నాయని సీపీఎం మండల కమిటీ కన్వీనర్ బంగారు నర్సింగరావు ఆరోపించారు. దీనివల్ల భూ యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
22ఏ జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు , సెప్టెంబరు 6 ( రాష్ట్ర ప్రభుత్వ అవగాహనారాహిత్యం, అధికారుల అనాలోచిత చర్యల కారణంగా పలుచోట్ల ప్రైవేట్ పట్టా భూములు సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేరుతున్నాయని సీపీఎం మండల కమిటీ కన్వీనర్ బంగారు నర్సింగరావు ఆరోపించారు. దీనివల్ల భూ యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22ఏ కింద ప్రభుత్వ, వివాదాస్పద భూముల అక్రమ క్రయవిక్రయాలను నిరోధించేందుకు నిషేధిత జాబితాను రూపొందించినట్లు తెలిపారు. అసైన్డ్, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, భూ పరిమితి చట్టం కింద స్వాధీనం చేసుకున్న మిగులు భూములు, కోర్టు వివాదాలు లేదా ప్రత్యేక నోటిఫికేషన్ పరిధిలోని భూములు ఇందులోకి వస్తాయని వివరించారు. అయితే సాంకేతిక లోపాలు, రికార్డులలో గందరగోళం కారణంగా కొన్నిచోట్ల నిజమైన ప్రైవేట్ పట్టా భూములు కూడా 22ఏ జాబితాలో చేరుతున్నాయని పేర్కొన్నారు. దీంతో అత్యవసర అవసరాలకు భూములను విక్రయించుకోవడం, రుణాలు పొందడం కష్టంగా మారుతోందన్నారు. పరిష్కారానికి గ్రీవెన్స్ అవకాశం తమ భూమి 22ఏ జాబితాలో ఉందో లేదో సంబంధిత అధికారిక భూ, రిజిస్ట్రేషన్ రికార్డుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన భూముల తొలగింపునకు పట్టాదార్ పాస్బుక్, రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, మ్యుటేషన్ పత్రాలు, అవసరమైతే కోర్టు తీర్పుల కాపీలతో గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్ పట్టా భూములు 22ఏ జాబితాలోకి ఎలా వచ్చాయో సమగ్రంగా పరిశీలించి, వాటిని గుర్తించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీపీఎం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగారు నర్సింగరావు కోరారు. నిజమైన భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.












