నిర్మల్ కు చెందిన ప్రముఖ కవి, వ్యాఖ్యాత డాక్టర్ బి. వెంకట్, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.
చైతన్య సారస్వత పరిషత్, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో జూన్ 6, 7 తేదీలలో జరిగిన ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. వెంకట్ కు శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం, జాతీయ ప్రణాళికాధికారి డాక్టర్ టి. పార్థసారథి, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ కె.వి.వి. సత్యనారాయణరాజు చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.
ఈ సాహిత్య మహాసభల్లో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ రాష్ట్రమంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నర్సిపల్లి హారిక, అమెరికాకు చెందిన జేమ్స్ వాట్ కొమ్ము, హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ టి. గౌరీశంకర్, ఆంధ్రప్రదేశ్ రక్షణదళం కమాండెంట్ కొండా నరసింహారావు, పూర్వ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు, ప్రముఖ విశ్లేషకులు యర్రాప్రగడ రామకృష్ణ, శ్రీనాథ కవిసార్వభౌముడు 13వ తరం వారసుడు కావూరి శ్రీనివాస్ శర్మ, కాసుల పురుషోత్తమకవి 5వ తరం వారసుడు కాసుల కృష్ణంరాజు, కంచర్ల గోపన్న 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, కవయిత్రి మొల్ల 14వ తరం వారసుడు డాక్టర్ ఎన్. శివశంకర్ వంటి పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సభల్లో డాక్టర్ వెంకట్ కవిసమ్మేళనం, సాహిత్య సభలకు విశిష్ట అతిథిగా, సమన్వయకర్తగా వ్యవహరించారు. తెలుగు భాషా వైభవంపై ఆయన చేసిన పద్య పఠనం, గానం ఈ పురస్కారాలకు దారితీసింది. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, నాటకాలు, గేయాలు, నృత్యాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. డాక్టర్ వెంకట్ సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా సేవలందిస్తున్నారు.












