హిందూ సమాజంలో సామాజిక సమరసత, పరస్పర బంధుభావన పెంపొందించడం ద్వారా ఐక్యత సాధించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఇందూరు విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీ వంగల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కల్లూరులోని వాసవి కళాశాల ప్రాంగణంలో "కల్లూరు ఖండ (లోకేశ్వరం, కుంటాల మండలాలు) సామాజిక సద్భావనా సదస్సు" ఆదివారం జరిగింది.
కార్యక్రమానికి కల్లూరు ఖండ సద్భావన ప్రముఖ్ శ్రీ కడార్ల హరి ప్రసాద్ నాయకత్వం వహించగా, హిందూ సమాజంలోని వివిధ సామాజిక వర్గాల నేతలు, పెద్దలు పాల్గొన్నారు. ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ వేణుగోపాల్, భారతీయ సమాజం ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని, కుటుంబ వ్యవస్థ, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలు మన సంస్కృతిలో ప్రత్యేకమని అన్నారు.
కాలక్రమేణా సమాజంలో ఏర్పడిన విభేదాలను అధిగమించి, పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. సామాజిక ఐక్యత కోసం వివిధ వర్గాల పెద్దలు కలిసి సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
సదస్సులో పాల్గొన్న వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. సమాజ ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాల కోసం కలిసికట్టుగా పనిచేస్తామని వారు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరం, కుంటాల మండలాలకు చెందిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.











