సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంను జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమించినట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నియామకం అనంతరం, బోడుప్పల్లో సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.
జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంను నియమించినట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా, ఉగాది పర్వదినం నాడు హైదరాబాద్లోని బోడుప్పల్లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.
30 ఏళ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగుతున్న కడారి బాలేశం సేవలు జర్నలిస్టుల హక్కుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి తెలిపారు. జర్నలిజంలో ఆయనకున్న అనుభవం సంఘ బలోపేతానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం బాలేశం వంటి సీనియర్ల సేవలను వినియోగించుకుని, బలమైన కార్యాచరణతో ముందుకు నడిచి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన గట్టిగా కొట్లాడతామని మానసాని కృష్ణారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను సంఘంలో కలిసి పనిచేయాలని, వారికి తగిన ప్రాతినిధ్యం ఇస్తామని ఆయన పిలుపునిచ్చారు.
తనపై నమ్మకంతో నియమించినందుకు కడారి బాలేశం జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్, జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్ల కమిటీలను త్వరలోనే పూర్తి చేసి, భారీ సభను నిర్వహించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని బాలేశం తెలిపారు. సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసి, రాష్ట్రంలోనే బలమైన గుర్తింపు గల జర్నలిస్టుల సంఘంగా ఏర్పడటానికి కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు.








