*" (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 22
మానసిక సమస్యతో బాధపడుతున్న తల్లి, చెడు వ్యసనాలకు బానిసగా మారిన తండ్రి.. ఇలాంటి పరిస్థితుల్లో అనాథలైన ఇద్దరు చిన్నారులను ఒక జర్నలిస్టు ఆదుకున్నాడు. వారి ఆచూకీ కనుగొని, ప్రభుత్వం తరఫున సహాయం అందేలా ప్రయత్నించినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విఫలమయ్యాడు. చివరకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించినా, తల్లి వారిని తీసుకుని మళ్లీ వెళ్లిపోయింది.
జర్నలిస్ట్ మామా... జర్నలిస్ట్ మామా నన్ను కాపాడవా... అని దూరం నుంచి ఆ జర్నలిస్టును చూడగానే ఆ ఐదేళ్ల బాలుడు పరుగున వచ్చి కాళ్లను చుట్టేస్తాడు. ఆ పిలుపులో ఆకలి, భయం, నాలుగేళ్లుగా తనకు అండగా నిలిచిన మామపై నమ్మకం ఉన్నాయి. తనను కన్నతల్లి రోడ్లపై ఎందుకు తిప్పుతుందో, తన చెల్లి 20 నెలల పసిపాప ఎందుకు ఏడుస్తుందో, తన తండ్రి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో, సొంత మేనమామ ఎందుకు పట్టించుకోవడం లేదో ఆ బాలుడికి తెలియదు. జర్నలిస్ట్ మామ వస్తాడు, నన్ను కాపాడతాడు అన్నదే అతనికి తెలుసు.
మానసిక సమస్యతో బాధపడుతూ, చెడు వ్యసనాలకు బానిసగా మారిన తండ్రి, రక్త సంబంధం లేకపోయినా చిన్నారుల రక్షణ కోసం ఎటో వెళ్లిపోయిన భార్యాభర్తల ఆచూకీని ఒక జర్నలిస్టు కనుగొన్నాడు. ప్రభుత్వం తరఫున తల్లికి వైద్యం చేయించి, పిల్లలకు రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఇటీవల గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా, కింది స్థాయి అధికార యంత్రాంగం మొక్కుబడి చర్యలతో సరిపెట్టింది. దీంతో అధికార యంత్రాంగం పనితీరు నచ్చక, ఆ జర్నలిస్ట్ తన నివాసంలోనే తల్లి, బిడ్డలకు ఆశ్రయం కల్పించాడు. అయితే, రాత్రికి రాత్రే మతిస్థిమితం సరిలేని కన్నతల్లి ఇద్దరు చిన్నారులను వెంట తీసుకుని మళ్లీ ఎటో వెళ్లిపోయింది. ఆ ఇద్దరు చిన్నారులకు జరగరానిది ఏదైనా జరిగితే తనతో సహా తాను కలిసిన ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత వహించాల్సిందే అని జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి, ఆ ఇద్దరు చిన్నారుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ విజ్ఞప్తి చేశాడు.
ఆ జర్నలిస్టు తన బిడ్డల్లా భావించి, జనన ధ్రువీకరణ పత్రాలు, శిశు ఆధార్ తో పాటు కుటుంబ సభ్యులందరి పేర్లతో రేషన్ కార్డును కూడా తెప్పించాడు. ఆ కుటుంబం తమ కాళ్లపై తాము బతకాలనే ఉద్దేశ్యంతో, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బ్యాంక్ రుణం తీసుకుని రూ.4.50 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. సరిగ్గా ఐదు నెలలకు భార్యాభర్తలు గొడవపడి, రాత్రికి రాత్రే ఇద్దరు బిడ్డలతో సహా తిరిగి తిరుపతికి వెళ్లిపోయారు. మళ్లీ కొన్ని నెలల అనంతరం వారు బిడ్డలతో సహా గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధి యర్రబాలెంకు తిరిగి వచ్చారు. చేసేది లేక, ఆ జర్నలిస్ట్ స్థానిక వాటర్ బాటిల్స్ తయారీ కంపెనీ యజమానితో మాట్లాడి, లక్ష్మి భర్త నానిని ఆటో డ్రైవర్ గా పనిలో కుదిర్చాడు. ఆ కంపెనీలోనే రూమ్ లో ఆ కుటుంబం తలదాచుకుంది. మూడు నెలల అనంతరం నాని అక్కడ పని మానేసి ర్యాపిడోకు వెళతానంటే, జర్నలిస్ట్ కొత్త ద్విచక్ర వాహనాన్ని కూడా ఇప్పించాడు.
అయితే, నాని భార్య లక్ష్మి తన మతిస్థిమితం సరిలేని కారణంగా చిన్నారులను తరచూ తీవ్రంగా కొట్టి గాయపరుస్తుండటంతో విసిగిపోయిన భర్త ఆమెను మందలించాడు. ఎన్నో సందర్భాల్లో బిడ్డలను తీసుకుని ఎటో వెళ్లి, కొన్ని రోజులకు భర్తను వెతుక్కుంటూ రావడం పరిపాటిగా మారింది. ఓసారి భర్త నాని తన భార్య, పిల్లల అదృశ్యంపై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. మతిస్థిమితం సరిలేక తనను ఇబ్బంది పెడుతున్న భార్య లక్ష్మి వ్యవహార శైలి పట్ల విసిగిపోయిన భర్త నాని చెడు అలవాట్లకు బానిసగా మారాడు. ఇటీవల తాను కూడా ఎటో వెళ్లిపోయాడు. చిన్నారుల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఉద్దేశ్యంతో జర్నలిస్ట్ వారి ఆచూకీ తెలుసుకుని, ప్రభుత్వం తరఫున తల్లికి వైద్యం చేయించి పిల్లలకు రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలకు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. అయితే కింది స్థాయి అధికార యంత్రాంగం మొక్కుబడి చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. అధికార యంత్రాంగం పనితీరు నచ్చని జర్నలిస్ట్ తన నివాసంలోనే తల్లి, బిడ్డలకు ఆశ్రయం కల్పించాడు. అయితే మతిస్థిమితంతో బాధపడుతున్న తల్లి లక్ష్మి రాత్రి రాత్రి తన ఇద్దరు బిడ్డలను వెంట తీసుకుని మళ్లీ ఎటో వెళ్లిపోయింది. ఆ ఇద్దరు చిన్నారులకు జరగరానిది ఏదైనా జరిగితే తనతో సహా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి బాధ్యత వహించాలని జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం మతిస్థిమితం సరిగా లేక బాధపడుతున్న లక్ష్మికి వైద్యం చేయించి, ఆమె ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.












