బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్ (జి), భైంసా మండలాల్లో పర్యటించి, పలు పాఠశాలలు, ప్రాజెక్టులను ఆయన తనిఖీ చేశారు.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ నర్సాపూర్ (జి), భైంసా మండలాల్లో పర్యటించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, కల్పిస్తున్న వసతులు, విద్యా బోధన, మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, నేటి హాజరు, తదితర విషయాలను ఆరా తీశారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, వాటిని పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు.
ప్రతి రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరు అయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల ప్రాంగణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత భైంసా మండలంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, తదితర వివరాలను అధికారులను అడిగారు. త్రాగు నీటి సరఫరాకు సంబంధించి అంశాలను సమీక్షించి, భవిష్యత్ ప్రణాళికల ప్రకారం నీటి నిర్వహణ ఉండాలని తెలిపారు.
అనంతరం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఈఓ భోజన్న, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యుఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సందీప్, అనిల్, తహసిల్దార్ లు శ్రీకాంత్, శశి భూషణ్, ఎంపీడీఓ పుష్పలత, ఎంపివో తిరుపతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


