నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ బాలసాహితీవేత్త, బాలబంధు గద్వాల సోమన్నకు ప్రతిష్ఠాత్మక 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ పురస్కారం' లభించింది.
విద్యాప్రదాత, విశ్రాంత అధ్యాపకులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరావు, స్వర్గీయ ముప్పవరపు ఆదిలక్ష్మి దంపతుల స్మారకార్థం ప్రతి సంవత్సరం ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
సంస్థ చైర్మన్ ఎం. లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం. విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో నెల్లూరులోని రోటరీ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా గద్వాల సోమన్న ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా గద్వాల సోమన్న రచించిన 'ప్రసన్న వదనం', 'చెంగల్వ పూదండ' పుస్తకాలను ఆవిష్కరించి సభకు పరిచయం చేశారు. ఇప్పటికే ఆయన కేవలం స్వల్ప కాలంలోనే 106 పుస్తకాలను రచించి ప్రచురించడం విశేషం.
బాలసాహిత్యానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, అవిరళ సాహిత్య కృషిని గుర్తించి ఈ జాతీయ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో సినీ, సీరియల్ నటుడు ఎం. మోహన్, ఆరెకటిక నాగేశ్వరావు, బొగ్గరపు రాధాకృష్ణ, సుబ్బయ్య, ఆదినారాయణ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా అభినందించారు.











