కిరాణా వ్యాపారులను వేధిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన బాధితుడు ముక్క శ్రీనివాస్ జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 45 సంవత్సరాలుగా కిరాణా దుకాణం నడుపుకుంటున్న తన వద్దకు 2025 డిసెంబర్ 15న ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్, సిబ్బందితో కలిసి వచ్చి, తనిఖీ పేరుతో బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారని, కస్టమర్లను బెదిరించి, ఒకరిని గోదాంకు తీసుకెళ్లి దాడి చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలో తన వద్ద ఉన్న యాలకులు, బాదం పలుకులు, కిరాణా సామాగ్రిని సీఐ, సిబ్బంది తీసుకెళ్లారని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా, బైండోవర్ పేరుతో 50 వేల రూపాయలు చాలాన రూపంలో, మరో 50 వేల రూపాయలు వ్యక్తిగతంగా తీసుకున్నారని, అదనంగా మరో 50 వేలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఐ బెదిరించడంతో, భయంతో తన దుకాణాన్ని మూసివేసి ఉంచుతున్నానని శ్రీనివాస్ వాపోయారు. ఈ విషయంపై మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
సదరు ఎక్సైజ్ సీఐ పై తక్షణ చర్యలు తీసుకొని, అరెస్టు చేసి, తనకు న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.


