మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థి 18 నెలలుగా లైంగికదాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేసిన ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
బాచుపల్లిలోని విఎస్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థినిగా ఉన్న బాధితురాలిని, అదే కళాశాలలో చదువుతున్న ఆశిష్ తనయ్ అనే విద్యార్థి 2024 నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమెకు మత్తుమందు కలిపిన చాక్లెట్లు ఇచ్చి, అనంతరం నగ్నంగా ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
2024లో కళాశాల గదిలో ఎవరూ లేని సమయంలో నిందితుడు విద్యార్థినిపై లైంగికదాడి చేశాడని, అప్పుడు కళాశాల సెక్యూరిటీ గార్డులు వీరిద్దరినీ పట్టుకొని యాజమాన్యానికి అప్పగించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు కళాశాల యాజమాన్యాన్ని కూడా తప్పుదోవ పట్టించినట్లు ఆమె తెలిపింది.
ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో నిందితుడు తన మిత్రుడైన ప్రవీణ్ తో కూడా చనువుగా ఉండాలని కోరినట్లు, అప్పుడు బాధితురాలు వారి నుంచి తప్పించుకొని తన గదిలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో బాధితురాలి తల్లి కుమార్తెకు ధైర్యం చెప్పి, వివరాలు తెలుసుకుని గత శనివారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకుని, ఆశిష్ తనయ్, అతని మిత్రుడు ప్రవీణ్ పై ఫిర్యాదు స్వీకరించారు. నిందితుడు ఆశిష్ తనయ్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


