రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భూసారాన్ని పెంచడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కంపాసాగర్ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రావేత్త డాక్టర్ శ్రీధర్ రైతులకు సూచించారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీ రైతువేదికలో గురువారం జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఈ మేరకు పలు సూచనలు చేశారు.
కంపాసాగర్ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రావేత్త డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసారాన్ని పెంచే పద్ధతులను అనుసరించాలని కోరారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగుచేయడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని ఆయన తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) ఉద్యాన శాస్త్రవేత్త టి.హిమబిందు మాట్లాడుతూ, కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి విభిన్న పంటలను సాగు చేయాలని సూచించారు. కుటుంబ అవసరాల మేరకు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉద్యాన అధికారి షేక్ నసీమా, ఉద్యాన శాఖ అందిస్తున్న సబ్సిడీల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.








