మహాబలిపురం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 20
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో వీరు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో వీరు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు.
అరుదైన కలయిక
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వీరిలో చంద్రబాబు, విజయ్ ల కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గతంలో చంద్రబాబు ఇతర ముఖ్యమంత్రులతో సమావేశాల్లో పాల్గొన్నారు. డీకే శివకుమార్ తో కూడా ఆయనకు పరిచయం ఉంది. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కొత్తగా హాజరవుతున్నారు. అందరిలోనూ సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ప్రత్యేకత చాటుకోనున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయిన విజయ్ కూడా ఈ సమావేశంలో మరో ఆకర్షణగా నిలుస్తారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
కీలక అంశాలపై చంద్రబాబు ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చంద్రబాబు కూలంకషంగా చర్చించనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయినా, పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలను కొలిక్కి తీసుకురావాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
విభజన హామీలు, ఆర్థిక అంశాలపై దృష్టి
షెడ్యూల్-9, 10లోని సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా కోరనున్నారు. అలాగే, రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారని సమాచారం.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ
అదేవిధంగా, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం పోర్టు, విశాఖపట్నం-విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.












