చంద్రగ్రహణం కారణంగా భారతదేశంలోని అనేక దేవాలయాలు మూసివేయబడతాయి. అయితే, కొన్ని ప్రముఖ ఆలయాలు మాత్రం యథావిధిగా తెరిచి ఉంటాయని సమాచారం.
దక్షిణాది రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఆలయం, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం చంద్రగ్రహణం సమయంలో కూడా తెరిచి ఉంటాయని ప్రకటించారు.
ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ఆలయాలు గ్రహణాన్ని పట్టించుకోకుండా భక్తులకు దర్శనం కల్పించనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయం, ఢిల్లీలోని కల్కాజీ దేవి ఆలయం, బీహార్‌లోని విష్ణుపద్ ఆలయం, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయాలు ఈ కోవలోకి వస్తాయి.
సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో ఆలయాలను మూసివేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే, కొన్ని పురాతన ఆలయాల నిర్మాణ శైలి లేదా ప్రత్యేక కారణాల వల్ల ఈ నిబంధనలకు మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఆలయాలు తెరిచి ఉండటం వల్ల భక్తులు గ్రహణ సమయంలో కూడా తమ దైవ దర్శనాన్ని చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ ఆలయాల నిర్ణయం భక్తులలో కొంత ఊరటనిచ్చింది.


