భైంసా పట్టణంలోని దారాబ్జి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.
మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ లైబ్రరీ విద్యార్థులు, ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ట్రస్ట్ నిర్వాహకులు మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో వీరయోధుడని, స్వరాజ్య స్థాపనకు కృషి చేసిన మహానాయకుడని తెలిపారు. ఆయన జీవితం ధైర్యం, దేశభక్తి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. యువత శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


