నిర్మల్ జిల్లా భైంసాలో ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) మరియు సెర్ప్ పరిధిలోని వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ 13 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
వీఓఏ కె. కల్పన ఆధ్వర్యంలో భైంసా మండల కేంద్రంలోని చైతన్య మండల సమైక్య (ఐకేపీ) కార్యాలయం సమీపంలో ఈ నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 302/2022 మరియు జీఓ 363/2025 ప్రకారం అమలు చేయాల్సిన పలు అంశాలు ఇంకా అమలు కాలేదని వీఓఏలు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీఓఏలకు తగిన వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. నెలకు రూ. 26 వేల వేతనం అమలు చేయాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వీఓఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, రూ. 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, వీఓఏలకు ట్యాబ్ సౌకర్యం అందించాలని, జీఓ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వీఓఏలు ఉపాధ్యక్షులు రాములు, కార్యదర్శి పొచిరాం, కే. లక్ష్మీ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












