విజయవాడ గ్రామీణం, 2026-08-09
ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల జీవన విధానం, వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర కథనం. అడవిని ఆవాసంగా, ప్రకృతిని ప్రాణంగా భావించే ఆదివాసీ సమాజం, మానవ నాగరికతకు విలువైన సంపదగా నిలుస్తోంది.
ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల జీవన విధానం, వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర కథనం. అడవిని ఆవాసంగా, ప్రకృతిని ప్రాణంగా భావించే ఆదివాసీ సమాజం, మానవ నాగరికతకు విలువైన సంపదగా నిలుస్తోంది. ఆధునిక ప్రపంచం సాంకేతికతలో దూసుకుపోతున్నా, ప్రకృతితో సమతుల్యంగా జీవించే ఆదివాసీల జీవన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం.
ప్రకృతే వారి జీవితం
ఆదివాసీలకు ప్రకృతి కేవలం వనరు మాత్రమే కాదు, అది వారి జీవన విధానం. చెట్టును ఒక జీవంగా, నదిని తల్లిగా, భూమిని ఆరాధ్యనీయమైనదిగా భావిస్తారు. ప్రకృతిని పరిరక్షించడాన్ని తమ బాధ్యతగా స్వీకరించి, సహజ వనరులను తరతరాలుగా కాపాడుతున్నారు. అడవిలో లభించే పండ్లు, దుంపలు, తేనె, ఆకుకూరలు, ఔషధ మొక్కలు వారి జీవనాధారాలు. వ్యవసాయం, పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం కొనసాగిస్తూ, అవసరమైనంత మేరకే వనరులను వినియోగించుకుంటారు. భవిష్యత్ తరాల కోసం వనరులను సంరక్షించే వారి జీవన తత్వం, సుస్థిర అభివృద్ధి భావనకు నిదర్శనం.
సంస్కృతి, కళలు, ఆహారం
ఆదివాసీ సంస్కృతి ప్రకృతితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది. వారి పండుగలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు ప్రకృతిని కేంద్రంగా చేసుకుని కొనసాగుతాయి. వర్షం, పంటలు, అడవి, జంతువులు, పక్షులు వారి సాంస్కృతిక జీవితంలో ప్రత్యేక స్థానం పొందాయి. వారి కళారూపాలు చరిత్ర, అనుభవాలు, సామాజిక విలువలను తరతరాలకు అందించే మాధ్యమాలుగా పనిచేస్తాయి. వస్త్రధారణలోనూ వారి ప్రాంతీయత, సంప్రదాయం ప్రతిబింబిస్తాయి. మహిళలు రంగురంగుల వస్త్రాలు, పూసల హారాలు, గాజులు, వెండి ఆభరణాలతో అలంకరించుకుంటారు. పండుగలు, జాతరల సమయంలో పూలు, ఆకులు వంటి సహజ పదార్థాలతో చేసుకునే అలంకరణలో వారి ప్రకృతి ప్రేమ కనిపిస్తుంది. ఆదివాసీల ఆహార విధానం ప్రకృతి ఆధారితమైనది. అడవుల్లో లభించే పండ్లు, దుంపలు, తేనె, వెదురు మొగ్గలు, పుట్టగొడుగులు, ఆకుకూరలు వంటి సహజ పదార్థాలను, జొన్న, రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలను వినియోగిస్తారు. సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం, రసాయనాల వినియోగం తక్కువగా ఉండటం వారి ఆరోగ్యకర జీవన విధానానికి కారణం.
సంప్రదాయ జ్ఞానానికి నిలయాలు
ఆదివాసీ సమాజాలు అపారమైన సంప్రదాయ జ్ఞానానికి నిలయాలు. ఔషధ మొక్కల వినియోగం, ప్రకృతి వైద్యం, వర్షాధార వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతుల్లో వారికి తరతరాల అనుభవం ఉంది. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, ఆదివాసీ మహిళలు, సంప్రదాయ మంత్రసానులు తల్లిశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషించారు. 2026 అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం సంప్రదాయ ఆదివాసీ మంత్రసానుల సేవలను గుర్తించడంపై దృష్టి సారిస్తోంది. వారి స్థానిక వైద్య పరిజ్ఞానాన్ని గౌరవించి, ఆధునిక ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.












