ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం బోస్ర గ్రామంలో శనివారం మహానీయుడు అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. సుభాష్ మాట్లాడుతూ, అన్నాభావు సాఠే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, రచయిత, సామాజిక సంస్కర్త అని కొనియాడారు. ఆయన రచనలు సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలకు ప్రతీకగా నిలిచాయని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, ఐక్యత, సేవాభావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహనీయుల జయంతులు వారి జీవిత సందేశాలను గుర్తు చేసుకుని ఆచరణలో పెట్టేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. వెనుకబడిన మాంగ్ సమాజ్ అభివృద్ధి కోసం ప్రత్యేక మాంగ్ సమాజ్ సంస్థను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని, రిజర్వేషన్లలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు జి. పరశురామ్, ఉప సర్పంచ్ ప్రసాద్, వార్డు సభ్యుడు దత్తరి, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు అన్నాభావు సాఠే జీవితం, సాహిత్య సేవలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.












