ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి పట్టణం, రాంబిల్లి మండలం పరిసర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి.
భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఈ అకస్మిక ప్రకంపనలతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
అదృష్టవశాత్తు, ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు ధృవీకరించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ప్రస్తుతం, స్థానిక అధికారులు మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు భూకంపానికి గల కారణాలను అంచనా వేస్తున్నాయి. ఇలాంటి తక్కువ తీవ్రత గల ప్రకంపనలు సాధారణంగా ఆందోళన కలిగించవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.












