భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి సందర్భంగా, జిల్లాలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు, పరిసరాల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ సూచించారు. ఈ కార్యక్రమాలను అధికారికంగా గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో చేపట్టాలని తెలిపారు.
అదేరోజు ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం ప్రారంభమవుతుందని, అనంతరం 10:30 గంటలకు అంబేద్కర్ భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన సభ జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోల్ల వెంకటస్వామి వివరించారు.
సాయంత్రం 4:30 గంటలకు నిర్మల్ బుద్ధ విహారం నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ర్యాలీ అనంతపేటలో ముగియనుంది.
ఈ కార్యక్రమాలలో సంఘం నాయకులు ఈరోల పురుషోత్తం, ఆకుల రమేష్, మాడస్తు భూమేష్, పుష్పురి సతీష్, దామ భూమేష్, రాజేందర్, సాయన్న, నరేష్, రాజేశ్వర్, రాస మహేష్, రాజలింగు వంటి పలువురు పాల్గొంటారని సమాచారం.











