ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో అధర్వవేద పారాయణ మహా యజ్ఞం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక వికాసానికి దాని పాత్రను వివరించారు.
ప్రఖ్యాత యాగ్నికులు ఆచార్య శ్రీధరానంద భారతి స్వామి, వైదిక పురోహితులు ఆచార్య వేద పునీతానంద భారతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞంలో, యజ్ఞానంతరం స్వాములు పలువురిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం యజ్ఞ సంస్కృతిపై ఆధారపడి ఉందని, జీవితంలో త్యాగ భావనతో జీవించడమే నిజమైన యజ్ఞమని వారు పేర్కొన్నారు.
ప్రతి పదార్థం చివరకు భస్మంగా మారుతుందని, జీవిత వాస్తవాన్ని అనుభూతిలోకి తెచ్చేది యజ్ఞమని స్వాములు తెలిపారు. పరమ వైరాగ్య భావనతో యజ్ఞం చేసి జీవితాన్ని పూర్ణాహుతి చేయాలని సూచించారు. హోమ ధూమంలో ఔషధ గుణాలు కలిగిన వాయువులు మిళితమై ఉంటాయని, అగ్నికి అన్నింటిని పవిత్రం చేసే శక్తి ఉందని వివరించారు.
ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ, ఈ అధర్వవేద పారాయణ మహా యజ్ఞం మొత్తం 25 రోజులపాటు జరుగుతుందని, ప్రస్తుతం 14 రోజులు పూర్తయ్యాయని, మరో 11 రోజులు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్, అంకాపూర్, నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుండి ధార్మికులు, యజ్ఞ దంపతులు భారీగా పాల్గొన్నారు.


