August 17 (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 18
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమను ప్రశ్నించే వారి గొంతులను నొక్కేసేందుకే ఈ పదాన్ని వాడారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గత పన్నెండేళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వారు పేర్కొంటున్నారు.
కుక్కను చంపాలనుకున్నప్పుడు దానిపై మోపే నెపం పిచ్చి. ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నోట దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో హఠాత్తుగా దిమాగీ నక్సల్స్ అనే పదం వాడకం, తమను ప్రశ్నించే వారి గొంతులను నొక్కేసేందుకు ఎంచుకున్న ఎత్తుగా కనిపిస్తోంది. ఈ అంచనా గత పన్నెండేళ్ల బీజేపీ పాలనలో దేశం చవిచూసిన అనుభవాల నుంచి వస్తుంది.
అడవుల్లోని సాయుధ నక్సలైట్లను నిర్మూలించడంలో విజయం సాధించినప్పటికీ, మావోయిస్టు భావజాలం కలిగిన వారు సమాజంలో పాతుకుపోయి ఉన్నారని, వారే దేశానికి కొత్త శత్రువులని, అటువంటి వారితోనే ముప్పు పొంచి ఉందని ప్రధాని పేర్కొనడం వెనుక అణచివేత ప్రణాళికకు రూపకల్పన జరుగుతోందన్న అనుమానాలు బయలుదేరాయి. అక్కడితో ఆగకుండా దిమాగీలను గుర్తించి ఏకాకులను చేయాలని ప్రధాని అన్నారు. ఇప్పటివరకు మోడీ, ఆయన పార్టీ బీజేపీ పలు సందర్భాల్లో ప్రతిపక్షాలను, ప్రజా ఉద్యమకారులను, పౌర హక్కుల కార్యకర్తలను, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారిని, నిరసన తెలిపే వారిపై దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, ఆటంక వాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులు అనే ముద్ర వేసి కేసులతో వేధించి ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని పార్లమెంట్లో, వెలుపల నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలను అర్బన్ నక్సల్స్ అని సంభోధించారు. ఈ పూర్వ రంగంలో ఏకంగా దిమాగీ నక్సల్స్ అనే వరకు వెళ్లారంటే కచ్చితంగా నిరంకుశ ఎజెండా దాగి ఉంటుందన్నది స్పష్టం.
ప్రధాని దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తడంతో నష్ట నివారణకు ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన వివరణ మరిన్ని సందేహాలను రేపింది. మావోయిస్టులకు మద్దతిచ్చేవారు, వేర్పాటు వాదులు, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వారే దిమాగీ నక్సల్స్‌గా చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఆర్టికల్‌ను వ్యతిరేకించే వారందరూ మేధో నక్సలైట్లయితే ప్రతిపక్షాలు దిమాగీ నక్సల్స్ అవుతారా వాస్తవానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరస్కరించింది బీజేపీ మాతృక ఆరెస్సెస్, పరివారం. చెప్పాల్సి వస్తే ఆ సంస్థలే జాతి విద్రోహులవుతాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక, ఆ పార్టీ పాలిత రాష్ట్రాలలో రాజ్యం అసహనం అనేకమార్లు బయటపడింది. ఉపా, రాజద్రోహం వంటి అనేక తీవ్రాతి తీవ్రమైన కేసులను, నిర్బంధాలను హక్కుల కార్యకర్తలు, ప్రజా ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, కళాకారులు ఎదుర్కొన్నారు. బీమా కొరేగావ్ కేసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హిందూ ఉన్మాదుల చేతుల్లో పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారు హత్యకు గురయ్యారు. మరెందరో దాడులను చవిచూశారు. జెన్-జీ ఆందోళనలతో దిమ్మ తిరిగిన మోడీ ప్రభుత్వం, భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలపై ఉక్కుపాదం మోపేందుకు సౌకర్యవంతమైన దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని కనిపెట్టినట్లు విదితమవుతుంది. పౌర స్వేచ్ఛకు సంకెళ్లుగా చూడాలి. ప్రభుత్వ నిరంకుశ చర్యలను రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, ప్రతి ఒక్కరూ ఖండించాలి.

