కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురాగల మూడు ప్రధాన బిల్లులను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించిన ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ బిల్లులపై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఈ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్ట సవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల ప్రధాన లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం, లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా, మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ఉంచారు. లోక్సభలో ఈ బిల్లులపై 18 గంటల పాటు చర్చ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి, అక్కడ 10 గంటల పాటు చర్చ జరపాలని భావిస్తున్నారు.
అయితే, ఇండియా కూటమి డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి మధ్య బిల్లులపై తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అనేది వేచి చూడాలి.








