హనుమకొండ, 2026-06-05
ఒక వ్యక్తి తన జీవితాన్ని నిజాయితీగా, దాపరికం లేకుండా అక్షరాల్లో ఆవిష్కరించడం ఒక సాహసంతో కూడుకున్న పని. ఇంజనీర్ యెర్రం మోహన మురళి రచించిన జీవన తరంగాలు స్వీయ ఆవిష్కరణ అనే గ్రంథం అలాంటి కోవకే చెందుతుంది. ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి ఆత్మకథగా కాకుండా, ఒక కాలపు జీవన చిత్రంగా, స్ఫూర్తిదాయక గ్రంథంగా రూపుదిద్దుకుంది.
ఒక వ్యక్తి తన జీవితాన్ని నిజాయితీగా, దాపరికం లేకుండా అక్షరాల్లో ఆవిష్కరించడం ఒక సాహసంతో కూడుకున్న పని. ఇంజనీర్ యెర్రం మోహన మురళి రచించిన జీవన తరంగాలు స్వీయ ఆవిష్కరణ అనే గ్రంథం అలాంటి కోవకే చెందుతుంది. ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి ఆత్మకథగా కాకుండా, ఒక కాలపు జీవన చిత్రంగా, స్ఫూర్తిదాయక గ్రంథంగా రూపుదిద్దుకుంది.
బాల్యం, విద్యాభ్యాసం
1945లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మోహన మురళి బాల్యం నైజాం పాలనా కాలపు సామాజిక, ఆర్థిక పరిస్థితుల మధ్య సాగింది. ఆయన తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పరిమిత ఆర్థిక వనరుల మధ్యనూ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం కుటుంబ సంస్కారాన్ని తెలియజేస్తే, బాల్యంలోనే మాతృవియోగాన్ని ఎదుర్కొని విద్యాభ్యాసాన్ని కొనసాగించిన తీరు ఆయన పట్టుదలకు నిదర్శనం. మెట్రిక్యులేషన్, పాలిటెక్నిక్ విద్యతో ప్రారంభమైన ఆయన విద్యా ప్రస్థానం ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఆగలేదు. ఉద్యోగ బాధ్యతలతో పాటు బి.టెక్, ఎం.టెక్, కంప్యూటర్ విద్యలో పి.జి. డిప్లొమా సాధించారు. పదవీ విరమణ తరువాత కూడా విద్యార్థి దశకు ముగింపు పలకకుండా సంస్కృతాన్ని అభ్యసించి ఎం.ఏ. పట్టా పొందారు. జీవితాంతం విద్యార్థిగా ఉండాలనే తపన ఈ జీవన ప్రస్థానానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన అంతరసూత్రం.
వృత్తి జీవితం, అనుభవాలు
విద్యుత్ శాఖలో 38 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానం ఈ గ్రంథానికి వెన్నెముకగా నిలిచింది. వివిధ హోదాల్లో నిర్వహించిన బాధ్యతలు, పదోన్నతులు, సాంకేతిక సవాళ్లు, కార్యనిర్వహణలోని అనుభవాలు, సహచరుల సమస్యల పట్ల స్పందన, సంఘ కార్యకలాపాల్లో నాయకత్వం వంటి అంశాలు ఒక నిబద్ధతగల వృత్తిజీవి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. రచయిత తన వ్యక్తిగత జీవితాన్ని సమాజం నుంచి వేరుచేయలేదు. తెలంగాణ సామాజిక నేపథ్యం, ఉద్యోగ ప్రపంచం, సమకాలీన పరిణామాలు, కుటుంబ బంధాలు, మిత్రత్వాలు, సంఘర్షణలు అన్నీ ఆయన జీవన ప్రవాహంలో సహజంగా కలిసిపోయాయి.
సాహిత్యం, ఆధ్యాత్మికత, సమాజ సేవ
ఈ గ్రంథంలోని విశిష్టతల్లో ఒకటి విద్య నుంచి సాహిత్యానికి, వృత్తి నుంచి ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభివృద్ధి నుంచి సమాజ సేవకు సాగిన పరిణామం. వేమన, సుమతీ శతకాలు, అన్నమయ్య, త్యాగరాజు, జయదేవుని అష్టపదులు, స్తోత్ర సాహిత్యం వంటి వాటి పట్ల ఆసక్తి; యోగా, నాదోపాసన, ధ్యానం; సంస్కృతాభ్యాసంఇవన్నీ రచయితలోని అంతర్ముఖ సాధకుడిని పరిచయం చేస్తాయి. సమాజ సేవ, రివాక్ ట్రస్టు, భారత దర్శనం వంటి కార్యక్రమాలు, రామప్ప వారసత్వంపై శ్రద్ధ కూడా ఆయన జీవితం కేవలం స్వీయ సాధనతో ఆగిపోలేదని తెలియజేస్తాయి. తాను ఎదగడంతో పాటు సమాజానికి తన వంతు ఇవ్వాలనే తపన ఈ జీవన ప్రస్థానానికి మరో విలువైన కోణం.












