జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ కైవసం?..
అభివృద్ధి – సంక్షేమం కేసీఆర్ పాలనలో, అవినీతి –
అరాచకం రేవంత్ పాలనలో : జడ్పీ చైర్మన్ విఠల్ రావు వ్యాఖ్యలు
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నిజామాబాద్, నవంబర్ 10
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపిస్తాయని జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగిరి విఠల్ రావు తెలిపారు. తెలంగాణ సృష్టికర్త, రాష్ట్ర కారణజన్ముడు కేసీఆర్ 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, తెలంగాణను సాధించడమే కాకుండా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు 6 నెలల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపితే, రేవంత్ రెడ్డి కేవలం 2 సంవత్సరాల్లోనే తెలంగాణను దేశంలో 28వ స్థానానికి దిగజార్చారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మించి అమలు చేయగా, రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి మహా ప్రాజెక్టులను అమలు చేసి, అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరించిన నేత కేసీఆర్ అని విఠల్ రావు తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమాజాలకు సమాన గౌరవం ఇచ్చిన కేసీఆర్ పాలన ప్రజలందరికీ ఆదర్శమని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రతి వర్గాన్ని మోసం చేసిందని ఆరోపించారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు ఎవరికీ న్యాయం చేయలేదని, బీసీలకు 42 శాతం హక్కులు ఇచ్చే మాట కూడా నెరవేర్చలేదని విఠల్ రావు విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్, కేటీఆర్ హయాంలో గోపీనాథ్ శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు ₹5,428 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. సుమారు 4 లక్షల ఓటర్లలో 2 లక్షల మంది ప్రత్యక్ష లబ్ధిదారులుగా మారారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని, డబ్బులు పంచిందని ఆరోపిస్తూ, “ఇస్లాం మత నాయకులు, పెద్దలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు” అని పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ “గరీబీ హటావ్” అంటే పేదరిక నిర్మూలన అని అర్థం, కానీ రేవంత్ రెడ్డి “గరీబ్ ఇల్లు కూల్చడం” అనే ఘనత సాధించారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రజలకు ఒక రిఫరెండంలా మారాయని, మాగంటి సునీత విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “ఎన్నికల సమయంలో పార్టీలు వేరైనా, అభివృద్ధి మరియు సంక్షేమంలో అందరూ కలిసిరావాలి” అని విఠల్ రావు పిలుపునిచ్చారు.