మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
తెలంగాణలో ఆదివారం, ఈ నెల 28వ తేదీ నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం, ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.












