నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 300 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల క్యాంపెయిన్లో భాగంగా సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, సర్పంచ్ కూనేరు భూమన్న సంయుక్తంగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆశిష్ రెడ్డి పర్యవేక్షణలో, ఆరు ప్రత్యేక విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు డాక్టర్ నిహారిక, డాక్టర్ స్వామి, డాక్టర్ రవీనా, డాక్టర్ అభిలాష్, డాక్టర్ అరవింద్, డాక్టర్ శశి ప్రీతం రోగులకు వైద్య సేవలు అందించారు.
గర్భిణీలు, చిన్నపిల్లలు, కంటి, ఎముకలు, దంత సంబంధిత సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను అందజేశారు. మొత్తం 300 మందికి పైగా ఈ సేవలను పొందారు.
అదనంగా, బోదకాలు వ్యాధితో బాధపడుతున్న 20 మందికి ప్రత్యేక చికిత్స విధానంపై శిక్షణ ఇచ్చి, మందులు, చికిత్స కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


